Read more!

యాజ్ఞవల్క్యుడు గురించి తెలుసా?

 

యాజ్ఞవల్క్యుడు గురించి తెలుసా?

వ్యాసుడు విష్ణ్వంశసంభూతుడు. అంటే ఆ మహావిష్ణువు అంశతో జన్మించినవాడు అని అర్థం. అటువంటి వ్యాసుడు ప్రతి ద్వాపరంలోనూ అవతరిస్తాడట. ముప్పైమూడో ద్వాపరంలో వ్యాసుడు మహాతేజస్వి అయిన యాజ్ఞవల్క్యుడిగా అవతరించాడంటోంది వైఖానసం.

పురాణాలలో ఇతిహాసాలలో ఎందరో యాజ్ఞవల్క్యులు కనిపిస్తారు. వారిలో వేదద్రష్ట, శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు అయిన యాజ్ఞవల్క్యుడు ఒకడు. ఈయన ఆదిత్యుణ్ణి ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని దర్శించా డంటోంది శతపథ బ్రాహ్మణం. ఈ శుక్ల యజుర్వేదం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దానిది అని, శతపథ బ్రాహ్మణం క్రీ.పూ. ఎనిమిదవ శతాబ్దానిది అని చెబుతారు.

వైశంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు గురువుతో విభేదించి సూర్యారాధన ద్వారా శుక్లయజుర్వేదాన్నీ, శతపథ బ్రాహ్మణాన్నీ దర్శించాడని మహాభారతం శాంతిపర్వం చెబుతోంది. అంటే మహాభారతంలో ఉన్న శాంతి పర్వంలో ఈ విషయాన్ని వివరంగా పేర్కొనడం జరిగింది. దాన్ని చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి.  ఇంకా హిందూ ధర్మంలో ఉన్న పురాణాలైన  విష్ణుపురాణం, భాగవతం, మరికొన్ని పురాణాలలో యాజ్ఞవల్క్యుడి ప్రస్తావన కనిపిస్తోంది.

క్రీ.పూ. 7వ శతాబ్దానికి చెందిన శుక్లయజుర్వేదంలోని బృహదారణ్య కోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మహావేదాంతిగా దర్శనమిస్తాడు. గార్గి, మైత్రేయి ఇతని భార్యలు. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బ్రహ్మతత్త్వాన్ని గురించీ అమృత తత్త్వాన్ని గురించీ బోధించినట్లూ చెబుతారు. అంతేకాదు జనక మహారాజు ఇతడికి సహస్రగోవులను దానం చేసినట్లు కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది.

పాణిని అష్టాధ్యాయికి కాత్యాయనుడు వార్షికాలు రచించాడు, ఇది క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. ఆ వార్షికాలలో 'యాజ్ఞవల్క్య బ్రాహ్మణా'ల ప్రసక్తి వుంది. అయితే వీటిని పైన పేర్కొన్నట్టు ప్రతి ద్వాపరంలో ఒక యజ్ఞవల్క్యుడు పుడతాడాని చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే  వీటి కర్త మరో యాజ్ఞవల్క్యుడై ఉండవచ్చునని విమర్శకుల భావన.

స్మృతికారుడైన మరో యాజ్ఞవల్క్యుడు చరిత్రపుటల్లో దర్శనమిస్తున్నాడు. అతడి పేరుమీదే యాజ్ఞవల్క్య స్మృతి అనే గ్రంథం ఒకటి ప్రచారంలో ఉంది. దీని కాలం విషయంలో పాశ్చాత్య చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది క్రీ. శ. ఒకటో శతాబ్ది నాటిదని జయస్వాల్, క్రీ. శ. 1-3 శతాబ్దుల మధ్యకాలం నాటిదని పి.వి. కాణే, క్రీ. శ. 4వ శతాబ్ది నాటిదని జాలి  అంటున్నారు.

అయితే యాజ్ఞవల్క్యుడు ఒక స్మృతి గ్రంథకర్తగానే కాక తాను ఒక యోగశాస్త్రానికీ అలాగే ఆదిత్య ప్రసాదితమైన ఒక ఆరణ్యకానికీ కర్తననీ, మిథిలలోని ఋషుల కోరికపై తను  యాజ్ఞవల్క్య స్మృతి గ్రంధాన్ని చెప్పాడు. ఇలా ప్రాచీన సాహిత్యం మరియు పురాణాల చరిత్రలో యాజ్ఞవల్క్యుడి గురించి ప్రస్తావించారు. ఇవి మాత్రమే కాకుండా ఆయన చాలా వ్యక్తం చేసిన సిద్ధాంతాలు ఎంతో ప్రాశస్త్యం పొందాయి.

                                 ◆నిశ్శబ్ద.